தமிழ்| telugu

» మనుజ్యోతి ఆశ్రమము » దత్తాత్రేయ ప్రవచనములు

దత్తాత్రేయ ప్రవచనములు

దత్తాత్రేయులు వారి గురించి మనకు అందరికీ తెలిసినదే. అవతార పురుషుడు అయిన దత్తాత్రేయుడు చిరుప్రాయంలోనే తపస్సిద్ధి పొందాడు. అయితే ఆ ఋషివాటికలోని అనేకమంది ఋషిపుంగవులు అవతారపురుషుడైన దత్తాత్రేయుని వద్దకు వచ్చి ”దత్తా ప్రభూ…. దైవ స్వరూపా….. నిన్ను మా గురువుగా భావిస్తున్నాము. మాకు ఏదైనా ఉపదేశం చెయ్యి, అని తరచూ ఆర్జింస్తుండేవారు.

”నన్ను మీరు గురువుగా భావిస్తున్నారేమో గానీ…. నేను మిమ్ములను శిష్యులనుగా భావించడము లేదు. ఉపదేశించడానికి నాకేమీ తెలియదు” అంటూ ఆ మహర్షులకి అందకుండా పారిపోతూ వుండేవాడు దత్తుడు. ఎలాగైనా సరే, దత్తుని పట్టుకుని ఉపదేశం పొందాలన్న పట్టుదల వారిది.

అయితే దత్తదర్శనం కోసం పరితపిస్తూ ధ్యానం చేస్తున్న మహర్షులు నూరు సంవత్సరాల పాటు తీవ్ర తపస్సు చేశారు. అప్పటికి దత్తుడు వారిని కనికరించాడు. ఆ శతసంవత్సరాల పాటు ఆ సరోవర అంతర్భాగంలో సమాధిస్థితిలో వున్న దత్తాత్రేయుల వారు సమాధి స్థితి నుంచి వెలుపటి నీటిపైకి వచ్చి ‘తమ దేహంలోని మూలాధారం నుండి సహస్రారం’ వరకూ గల సప్తచక్రాలలో ‘యోగశక్తి’ రూపంలో వున్న ‘శ్రీ మహలక్ష్మి’ని మేలుకొల్పారు. ఆ ‘యోగశక్తి’ ఆయన నుండి ‘ఋషికన్య’ రూపముతో అవతరించి ఆయనకి నమస్కరించింది.

”అనఘా……” అంటూ దత్తుడు ఆమెని సంభోధిస్తూ ”నీవే నా శక్తివి. నీవే నేను. నేనే నీవు. నీవు నా అంతరంగంలో ‘యోగశక్తి’గా ఉన్నప్పుడు నేను ‘దత్తాత్రేయు యతి’ని. నేను ఇలా గృహస్థరూపం ధరించినప్పుడు నీవు నా ‘అర్ధాంగలక్ష్మి’వి. ‘అనఘాదేవి’వి. అప్పుడు నేను అనఘుడను’. నీవు అర్హులకు, పుణ్యాత్ములకు ‘ఋషిపత్ని’ గానూ, అనర్హులకి ‘నాట్యకతై’గానూ దర్శనమిస్తావు” అని పలికి అనఘాదేవిని తన అంకపీఠం మీద కూర్చోబెట్టుకుని నీటిపై తేలుతూ తీరానికి చేరుకున్నారు.

అనఘాలక్ష్మి సమేత దత్తాత్రేయుల వారి రాకని గ్రహించి నూరు సంవత్సరాలుగా ధ్యానస్థితిలో వున్న మునులు కళ్లు తెరిచి వారిని చూశారు. వారిలో కొందరు చిత్తశుద్ధి లేని మునులకి దత్తుడు సురాపాత్ర చేత ధరించిన మధుపాన లోలుడుగానూ, అనఘాదేవి నాట్యకతైగానూ కనిపించారు. వారు ఛీత్కారాలు చేస్తూ ”ఈ స్త్రీ లోలుడు మధ్యపాన ప్రియుడి కోసమా, మనం ఇన్నేళ్ళు తపస్సుతో వ్యర్ధం చేసుకున్నది?” అనుకుంటూ చంచల చిత్తులై వెళ్ళిపోయారు. అయితే దత్తుడు పరబ్రహ్మయని, అవతార పురుషుడు అని జగద్గురు అని విశ్వసించి నిశ్చలమైన భక్తి శ్రద్దలతో ఆయన దర్శనభాగ్యం కోసం తపించిన వారికి దత్తుడు సచ్చిదానంద సద్గురు బ్రహ్మముగా, అనఘాదేవి దత్త యతీశ్వరుడి అర్ధాంగిగా దర్శనమిచ్చారు. వారందరూ ఆనందభాష్పములతో ఆ దంపతులకి పాదాభివందనం చేసుకున్నారు. శ్రీ గురుదత్తులు దివ్యాశీస్సులతో వారిని అనుగ్రహించారు. అనంతరం…..

”ఓ! మునీశ్వరులారా! గురువే బ్రహ్మ….. గురువే విష్ణువు…. గురువే మహేశ్వరుడు….. ఆ త్రిమూర్తుల స్వరూపమైన గురువే నిరాకార, నిరంజన పరబ్రహ్మము…. అట్టి గురువును మనసా… వాచా… కర్మణా…. ఆత్మార్పణ బుద్దితో ఎవరు సేవిస్తారో… అనన్య భక్తితో ఎవరు విశ్వసిస్తారో …. ఆ దైవమే గురువుగా వచ్చినప్పుడు అటువంటి ఆ గురువునే ఆశ్రయిస్తారో, ఆ గురువే సర్వస్వమని త్రికరణ శుద్ధిగా ఎవరు విశ్వసిస్తారో వారే ఉత్తమ శిష్యులు. అటువంటి శిష్యుల సమస్త బరువు బాధ్యతలను పరంధాముడైన ఆ సద్గురువు స్వీకరిస్తాడు. అటువంటి సద్గురువు – ఉత్తమ శిష్యుడు రూప నామాల్లో వేర్వేరుగా కన్పించినా వారు ఏక రూపులు…. సద్గురువుకి శిష్యుడు! శిష్యుడికి సద్గురువు తప్ప అన్య ప్రపంచము యావత్తూ నిమిత్తమాత్రముగా గోచరించును.

ఇట్టి సద్భావనతో…. సద్భుద్ధితో… సద్గురువే సర్వస్వం అని విశ్వసించే సమస్త భక్త జనులకు నన్ను నేను దత్తత చేసుకుంటున్నాను. నా భక్తులు ఈ సువిశాల విశ్వములో ఎక్కడ ఏ మారుమూలనున్నా, అనన్యభక్తితో నన్ను స్మరించిన మరుక్షణమే దర్శనమిస్తాను. వారి ఆర్తి తీరుస్తాను. వారి ప్రాపంచిక జీవన సమస్యలు పరిష్కరిస్తాను. అంత్యమున వారికి మోక్షము ప్రసాదిస్తాను. అని సెలవిచ్చెను. కాని

ఇది నా వ్రతం….. ఇది నా మతము….. ఇది నా నియమం….. అని చెప్పుకొను … భక్తిశూన్యులకు, విశ్వాసరహితులకి నా దర్శనం దుర్లభం… బ్రహ్మకల్ప మహాప్రళయకాలం సమీపించే వరకూ నేను విశ్వవ్యాప్తినై నశిస్తాను…… భక్తజనావాళికి ఉద్దరిస్తాను అని ప్రవచించారు. శ్రీగురు దత్తాత్రేయుల వారు.

– కూర్పు : ప్రభువరం, మోతుగూడెం.

Filed under: మనుజ్యోతి ఆశ్రమము