தமிழ்| telugu

» హిందూ పురాణములు » ధర్మములు

ధర్మములు

”శ్రేయాన్‌ స్వధర్మో విగుణః పరధర్మాత్‌ స్వనుష్ఠితాత్‌ |

స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ”

తాత్పర్యం : చక్కగా అనుష్టింపబడిన పరధర్మము కన్నను గుణములేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి ధర్మాచరణమున మరణము సంభవించినను శ్రేయోధాయకమే. పరధర్మము భయంకరమైనది. ఆచరణకు అనుచితమైనది. – భగవద్గీత 3:35.

”ధర్మములు మిదం జగత్‌”. ఈ జగత్తు ధర్మమూలము. ధర్మమే ఈ జగత్తునకు ఆధారము. ధర్మోహి పరమో లోకే సత్యం ప్రతిష్టితమ్‌. లోకములో ధర్మమే గొప్పది. ధర్మమునందు సత్యము ప్రతిష్టితమై యున్నది. ధర్మమునందు ధర్మార్థ కామములన్నియు కలవు. ధర్మము వలన అర్థము, సుఖము కలుగును. పరదారాసక్తత, వైరము లేకుండా చంపుట, అసత్యవాక్యము అనునవి కామము వలన కలుగు వ్యసనములు. కామము వలన కలుగు వ్యసనములకు దూరముగా వున్నవాడే ఈ లోకమున ధర్మాచరణ చేయగలడు. ఇందు అసత్యము గొప్ప వ్యసనము.

ధర్మము : దేవతలు ధర్మమును, రాక్షసులు అధర్మమును ఆశ్రయించి వుందురు. ధర్మము అధర్మమును అణగత్రొక్కునప్పుడు కృతయుగము. అధర్మము ధర్మమును అణగత్రొక్కునప్పుడు కలియుగము. వేద ప్రణీతము ధర్మము. వేద ప్రణీతము కాని అవైదికము అధర్మము. ధర్మమును పుణ్యమని, అధర్మమును పాపమనీ చెప్పుదురు. ప్రాణులకు పుణ్య పాపములు అనుభవంబులు కాని ఊరకపోవు. అనగా వాటి ఫలితములు ఏదో ఒక రోజు తప్పక అనుభవించవలసియే ఉండును. ధర్మము చాలా సూక్ష్మమైనది. తెలిసికొనుట చాలా కష్టము. ధర్మాధర్మ విచక్షణ మనస్సే తెలిసికొనును. అపర ధర్మమని, పర ధర్మమని రెండు విభాగములు. అపర ధర్మములో ధర్మము అనగా చేయవలసిన పనులు. అర్థము అనగా ధన సంపాదన. కామము అనగా సుఖభోగములు అనుభవించుట గుఱించి వివరించబడును. పర ధర్మములో మోక్షమునకు చేయవలసిన కర్మానుష్ఠానం వివరించబడును. అపర ధర్మములో సామాన్య ధర్మములు, విశేష ధర్మములని ధర్మములు రెండు తెఱంగులు.

 

భీష్ముని వద్ద ధర్మరాజు నరజాతి సాధారణంబులగు ధర్మంబులను, వర్ణాశ్రమ ధర్మంబులును, రాగ వైరాగ్యోపాధులతో గూడి ప్రవృత్తి ధర్మంబులును, దాన ధర్మంబులును, రాజ ధర్మంబులును, స్త్రీ ధర్మంబులును, శమదమాదికంబులును, హరితోషణంబులగు ధర్మంబులును, ధర్మార్థకామ మోక్షములును తెలుసుకొనెను. (భాగవతం – ప్రధమ స్కంధము – 215).

అపర ధర్మము పాటించునప్పుడు నిజ ధర్మ బాధకంబయిన ధర్మము అనగా విధర్మము, పరధర్మ ప్రేరితంబయిన ధర్మము అనగా తనకు స్వధర్మముకాక ఇతరులకు విహితమయినది, అభాస ధర్మము అనగా స్వేచ్ఛగా మఱియొక ఆశ్రమమును గ్రహించి శాస్త్ర విరుద్ధముగా చేయుట, కపట ధర్మము అనగా వంచనతో దంభముతో సలుపునది. పాషండ ధర్మము అనగా వేద విరుద్ధ ధర్మము వీటిని మానవలయును. అనగా తన జాతి వారికి గాక ఇతర జాతివారికై చెప్పబడిన ధర్మములు ఆచరించరాదు. ఉదాహరణ : అర్జునుడు క్షత్రియుడు. క్షత్రియ జాతికి యుద్ధము చేసి శత్రు సంహారము చేయుట ధర్మము. సన్యాసికి, బ్రాహ్మణునికి అహింస అధర్మము. కావున క్షత్రియుడైన అర్జునుడు యుద్ధము మాని భిక్షమెత్తుకొనుట అధర్మము. అహింస వ్రతము చేయుట క్షత్రియునికి అధర్మము. అపర ధర్మము (సైసర్గిక ధర్మము) ఆచరించినచో మనస్సుకు శాంతి, దేశమునకు క్షేమము కలుగును. కావున అపర ధర్మము దురిత శాంతి సమర్థంబగు అని చెప్పబడినది. ప్రజలకు వాక్‌మనః కాయవృత్తుల వలన ఆచరించు అపర ధర్మము సమస్త లోకంబులకు విశోకంబు చేయును. కావున అపర ధర్మము పాటించిన దేశమునకు ప్రజలకు క్షేమము కలుగును.

అపర ధర్మములో మరల సంఘ నియమములు, వ్యక్తి నియమములని రెండు విభాగములు. జాతి ధర్మము, ఆశ్రమ ధర్మములు సంఘ నియమములు. వీటినే కులధర్మములని అందురు. కుల ధర్మములు పాటించవలయునని వేద, పురాణములు చెప్పినవి. కుల ధర్మములు పాటించుట వలన భగవంతుడు సంతోషించును. అదియు పుట్టుకకు సార్థకత. ఈ విషయమునే పురుషుడు చేయు వర్ణాశ్రమ ధర్మంబులకు మాధవుడు సంతోషించుటయే సిద్ధి అని భాగవతమున చెప్పబడినది.

తత్త్వ దర్శనులైన ఋషులచే ఇహలోక జీవనోపాధికి కృషి, పరలోకమునకై అగ్ని హోత్రాది ఉపాయంబులు చెప్పబడినవి. వీటిని కాదని ఇంకొక విధముగా ఆచరించు వారు ఫలమును (ఇహలోక పరలోక ఫలములను) పొందరు. అపర ధర్మము పాటించుట వలన దేశము పాడిపంటలు ధన ధాన్య సమృద్ధి కలిగి సుఖశాంతులతోనూ, ఆదర్శ పౌరులతోనూ విరాజిల్లును. వేదములలో చెప్పిన నియమములు పాటించకపోవుటయే అధర్మము. అధర్మ ప్రవర్తన వలన వ్యక్తి యొక్కయు, సంఘము యొక్కయు శ్రేయస్సుకు విఘాతము గలుగును. దేశములో శాంతి భద్రతలు లేక అశాంతి, అలజడలు ఉండును. కావున వేద చోదితంబులగు ధర్మంబులందు ఆసక్తుడవు కమ్ము అని వేద పురాణముల ఆదేశము. ధర్మములలో శాస్త్ర విషయములు చెప్పబడును. వాటిని ఆచరించుటను కర్మ అని అందురు. శాస్త్ర విషయములు ఆచరణ అను రెండింటిని చెప్పినది విద్య అని చెప్పబడును.

మోక్ష మార్గమునకు అవలంభించవలసిన శాస్త్ర పాఠము పరధర్మము, ఆచరణ కర్మ. ఈ రెండింటిని చెప్పినది పరవిద్యగా గ్రహించవలయును. ధర్మాచరణను పుణ్యమనియు, అట్టి ధర్మాచరణపరులను పుణ్యాత్ములనియును, అధర్మాచరణను పాపమనియు అట్టి అధర్మాచరణ పరులను పాపాత్ములనియు చెప్పుదురు. విధులు బాధ్యతలుగా చెప్పబడే అపర ధర్మము పాటించుట సంఘము యొక్కయు, వ్యక్తి యొక్కయు బాధ్యత. ఈ అపర ధర్మమును పాటించనిచో దేశములో సుఖశాంతులు ఉండవు. ప్రజలు కష్టముల పాలగుదురు. కేవలము అపర ధర్మ ప్రచారము వలన ప్రయోజనము లేదు. ఈ ధర్మ ప్రచారము వలన ఉత్తమ పౌరులు, ఉత్తమ దేశము ఏర్పడదు. అధర్మ పరులను అనగా విధులు బాధ్యతలు నెరవేర్చని వారిని, అకార్యములు అనగా చేయకూడని పనులను చేయు వారిని ప్రభువు (ప్రభుత్వము) కఠినముగా దండించవలయును. సరియైన దండన లేనియెడల మరియు ఆలస్యముగా విధించు దండన వలన రాజ్యములో సుఖశాంతులు వుండవు. దీనినే అరాజకమనిరి. అరాజకములో ధర్మబోధ నిరర్థకము. అధర్మ పరులకు సకాలములో సరియైన దండన విధింపబడినచో ధర్మ ప్రచారము వలన ఉత్తమ పౌరులు గలిగి దేశము సుఖశాంతులతో విరాజిల్లును. సంఘ విద్రోహులు నశించెదరు. సత్పురుషుల ఆచరణయే ధర్మప్రచారము. ఈ అపరధర్మాచరణ వలన కీర్తి, ధనము వచ్చునే గాని మోక్షము రాదు.

ధర్మపరముగా ధనము సంపాదించి, అధర్మములు గాని సుఖఃభోగములు అనుభవించ వలయును. ధనము కలిగినవారు కేవలము సుఖభోగములకు వ్యయము చేయక పుణ్యకార్యంబులు చేయవలయును. సుఖభోగములు అనుభవించుటయే కామము. అపర ధర్మాచరణ వలన ఆపదలు రావనేది లేదు. కావున అపర ధర్మము ఆచరించి, దారిద్య్రములో ఉండి సుఖభోగములు లేక నిరాశతో ఉండి ఆపదలో దైవము రక్షింపనప్పుడు అపరధర్మాచరణ నిష్పలమనే భావన గలుగును. అప్పుడు ధర్మాచరణ నిష్ఫలమని అనుకొనును. అపర ధర్మము గుఱించి బాధలలో వున్నవాని భావనను లక్ష్మణుని పరంగా చిత్రీకరింపబడినది. ఉత్తమ మార్గమునందున్నను (అపరధర్మాచరణ చేసినను) జితేంద్రియుడైనను, ఆపదల నుండి (అపర) ధర్మము రక్షింపకున్నది. అందువలన (అపర) ధర్మము నిష్ప్రయోజనము. ధర్మమన్నది ఉన్నచో ధర్మాత్ముడయిన వానికి (రామునకు) ఆపద రాకూడదు. ధర్మమున్నచో ధర్మపరునికి ఆపదలు వచ్చి వుండెడివి కావు. జంగమ స్థావరములు కనబడుచున్నవి. ధర్మము అగోచరము. కావున ధర్మమనేది లేదు. ధర్మము వలన సుఖము అధర్మము వలన కష్టము వచ్చినచో, జనులు అధర్మము నందు ఆసక్తి చూపక ధర్మాచరణ చేసి సుఖమునే పొందెడివారు. ధర్మపరులు ఆపదలో చిక్కుకొనుచున్నారు. అధర్మపరులకు సంపదలు అభివృద్ది అగుచున్నవి. కావున ధర్మము కష్టములను, అధర్మము సుఖములను ఇచ్చుచున్నట్లు కనబడుచున్నవి. ధర్మపరుడవయిన నీవు (రాముడు) కష్టముల పాలగుచున్నావు. నీకు సుఖము లేదు. అధర్మపరుడు (రావణుడు) సుఖపడుచున్నాడు. అతనికి ఆపద లేదు. కావున ధర్మమనేది లేదు. సత్యానికి స్థానము లేదు. ఋజుత్వానికి మంచితనానికి చోటు లేదు. ధర్మా ధర్మములు సుఖమును, కష్టమును యివ్వవు. కావున ధర్మాచరణ వ్యర్థము. ధర్మము దుర్భలమై అధర్మమునకు లొంగిపోయిన అట్టి ధర్మమును పరిత్యజించుట యుక్తము. ధర్మము ఆచరించినా అధర్మము ఆచరించినా వినాశము కలుగునప్పుడు ఏది ఆచరించినా ఒక్కటే. కాలానుసారము ధర్మాధర్మములను ఆచరించవలయును. ధర్మము వలన గాక బలము వలన కార్యసాధన గలిగినట్లయితే ధర్మమును విడిచి బలమును ఆశ్రయింపుము.

రాముడు ఈ మాటలను వినలేదు. అపరధర్మాచరణ వలన రామునికి గొప్ప కీర్తి వచ్చినది. అపరధర్మాచరణ వలన భూలోకమున కీర్తి ప్రతిష్టలు పరలోకమున స్వర్గప్రాప్తి గలుగును. అపర ధర్మము ఆచరించనిచో భూలోకమున దండన (జైలు) పరలోకమున నరక ప్రాప్తి గలుగును. ధర్మాచరణ ఫలము ఉత్తమ లోకము. ఈ విషయమును చెప్పుటలకు శ్రవణ కుమారుని కధ చెప్పబడినది. శ్రవణ కుమారుడు మాతాపితరులను సేవించాడు. ఉత్తమ ధర్మపరుడు కాని అకారణముగా చపంబడినాడు. (దశరథుని బాణము వలన చనిపోయినాడు). అట్టి మరణ సమయమున ధర్మాచరణకు ఫలితము లేకపోయినదని వాపోయినాడు. శ్రవణ కుమారుడు మరణించాడు. దివ్య దేశమును ధరించి స్వర్గమునకు వెళ్ళుచూ తను తల్లిదండ్రులకు సేవ చేసిన పుణ్యఫలితము వలన నేడు స్వర్గము లభించినదని దివ్య శరీరధారియై చెప్పినాడు.

పరధర్మము : పరధర్మమునకు దృష్ట, శ్రుత, ప్రపంచ అర్థంబు ఫలంబు కాదు. భక్తి ఫలంబు. అసంగులయిన వారికి మోక్షమిచ్చు. నారాయణ కథలయందు చెప్పబడినదే పరధర్మము. మన ధర్మాచరణ అధర్మాచరణకు దేవతలు సాక్షులు. తీవ్ర మోక్షేచ్ఛగలవారు మాత్రమే పరధర్మమును పాటించవలయును. భరుతుడు తల్లిని గౌరవించలేదు. లక్ష్మణుడు తండ్రిని గౌరవించలేదు. రాముడు గురువైన వసిష్టుని మాట వినలేదు. గోపికలు పరపురుషుడైన శ్రీకృష్ణుని తమ భర్తలను బంధువులను కాదని అతనితో రమించినారు. (యౌగిక అర్థము వేఱు) ప్రహ్లాదుడు తన తండ్రి విష్ణువుని పూజింపవద్దని చెప్పిన మాటను వినలేదు. వీరు వేదములో అపర ధర్మములో చెప్పిన తల్లిని తండ్రిని గురువును పూజింపమని చెప్పిన ఉపదేశములను పాటించలేదు. అయినను పరధర్మ ఆచరణ పరులగుట వలన వీరందఱూ ధర్మజ్ఞులే.

– కూర్పు : కె. రామకృష్ణ, భగవద్గీత వర్షిణి, విజయవాడ.

Filed under: హిందూ పురాణములు