தமிழ்| telugu

» మనుజ్యోతి ఆశ్రమము » భయము కూడా భక్తేనా?

భయము కూడా భక్తేనా?

”చతుర్విధా భజంతే మాం జనాస్సు కృతినోఃఅర్జున!

ఆర్తో జిజ్ఞాసు రర్థార్థి జ్ఞానీచ భరతర్షభ|| ” – (భగవద్గీత 7:16)

ఆర్తులు, జిజ్ఞాసులు, సంపదలు కోరేవారు, జ్ఞానులు – ఇలా తనను సేవించేవారు నాలుగు విధాలుగా ఉంటారని శ్రీకృష్ణుడు చెప్పాడు. దీనిని బట్టి ఎందుకోసమని ఎవరు దండం పెట్టినా వాళ్ళందరూ దైవభక్తులేనని, దేవుడు వారిని ఆదుకుంటాడనీ అన్వయించుకుంటూ వుంటాం. కానీ ఈ శ్లోకంలో ఒక సూక్ష్మం ఉంది. సుకృతులైన జనం ఆపదలో ఉండిగాని, తత్త్వం తెలుసుకోవాలనిగాని, జ్ఞానార్థులైగాని తనను సేవిస్తే తరిస్తారు అని ఈ శ్లోక భావం.

ఇందులో ‘తనను’ సేవించడం అనేది ప్రధానం. సుకృతులు అంటే పుణ్యం చేసేవారని సామాన్యార్థం. మంచి పనులు చేసేవారని విశేషార్థం. తమ అవసరాలకై నరాధములను సేవించే కంటే నారాయణున్ని సేవిస్తే మంచిదే గదా! నమ్ముకున్న దైవాన్నికన్న ఎవర్ని అడుగుతాడు భక్తుడైనవాడు?

అయితే, లోకంలో భక్తులుగా చలామణీ అవుతున్నవారెందరూ ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. భగవానుడు ”మీ అవసరాలను నాకు నివేదించండి. మీకు ఎప్పుడు ఏది ఎంతవరకు అవసరమో నాకు తెలుసు కాబట్టి మీరు అడిగినదాన్ని కాక, మీరు తరించడానికి, కావలసినదాన్ని నేను ఇస్తూ వుంటాను” అంటాడు. నిజమే కదా! మనకు ఏమి కావాలో మనకంటే దేవునికే గదా ఎక్కువగా తెలిసేది!

కోరికలు తీర్చి అనుగ్రహించటం ఒక విధం. కోరికలను తిరస్కరించి అనుగ్రహించటం మరొక విధం. ఈ రెండింటిలో దైవాన్ని నమ్ముకున్న వాడికి ఏదైనా మేలే చేస్తుంది. దైవాన్ని కాక కోరికలనే ఆరాధించేవారి గురించి ఏమిటి? – ఇందులో వారిని గురించిన ప్రస్తావన లేదు. కానీ ఇలాంటి వారే ఎక్కువగా మనకి తారసపడుతూ ఉంటారు.

మనందరం మన అవసరాలను, మన కోరికలను, మన సమస్యలను, మన బలహీనతలను, మన రోగాలను ధ్యానిస్తామే గానీ హృదయాల్లో దైవానికి చోటివ్వం. అలాంటప్పుడు దైవం మాత్రం ఏం చెయ్యగలడు?

ఇలాంటివారిని గురించి కూడా గీతలో గోవిందుడు చక్కగా చెప్పాడు.

”న మాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః|

మయయాః పహృతజ్ఞానాః ఆసురం భావమాశ్రితాః|| ” – (భగవద్గీత 7:15)

చెడ్డపనులు చేసేవారు, మూఢులు, నరాధములు, మాయకమ్మినవారు, నా పేరు చెప్పుకున్నప్పటికీ వారు నన్ను గాక వారిలోని అసురభావాలనే ఆశ్రయిస్తున్నారు అని ఈ శ్లోక భావం. దీనిని మనం అంతగా పట్టించుకోం. ఎవరికి వారు జాగ్రత్తగా గమనించుకుంటే దేవుని పేరు చెప్పుకున మనం దండం పెడుతున్నది దేవునికా, మనలోని అసుర భావాలకా అనే విషయం స్పష్టపడుతుంది.

అయితే, ఇక్కడ ఒక చిక్కు వస్తుంది. అసుర భావాలను ఆరాధించేవారు కూడా తాము దైవాన్నే ఆరాధిస్తున్నామంటారు. దేవుడేమో వారు నన్ను ఆరాధించడం లేదు అని అంటున్నాడు. ఎలామరి? ఒక ప్రశ్న – ఈ అసురీభావారాధకులు దైవాన్ని గురించి ఎందుకు పట్టించుకుంటున్నారు? కేవలం భయంతో! మరి భయాన్ని కూడా భక్తే అందామా?

– కూర్పు : ప్రభువరం, మోతుగూడెం.

Filed under: మనుజ్యోతి ఆశ్రమము