தமிழ்| telugu

» మనుజ్యోతి ఆశ్రమము » మనుజ్యోతి ఆశ్రమములో బ్రహ్మాండముగ జరిగిన 45వ కల్కిజయంతి ఉత్సవములు

మనుజ్యోతి ఆశ్రమములో బ్రహ్మాండముగ జరిగిన 45వ కల్కిజయంతి ఉత్సవములు

పాఠకులకు ముందుగానే తెలిపినట్లు జూలై నెల 15వ తేదీ నుండి 22వ తేదీ వరకు చాలా ఘనంగా 45వ కల్కిజయంతి ఉత్సవములు మనుజ్యోతి ఆశ్రమములో జరిగాయి. ప్రతీరోజూ ప్రత్యేక కార్యక్రమములతో వివిధ ప్రాంతాల నుండియు, దేశముల నుండియు వచ్చిన శ్రీలహరికృష్ణ గారి భక్తుల సవ్వడితో, చల్లని వాతావరణంలో ఎంతో వైభవంగా ఉత్సవములు నిర్వహించబడినవి. వీటిలో ముఖ్యంగా 17వ తేదీన ”సర్వమత సమావేశము మరియు దేశీయ సమైక్యతా సమావేశము” అను తెలుగు కార్యక్రమము జరిగినది. దీనికి ఆంధ్ర దేశము నుండి పేరుగాంచిన పలు వక్తలు, కవులు వచ్చి వారి వారి శైలిలో భగవంతుని యొక్క కీర్తిని, గుణములను వర్ణించుతూ శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి ఆశీస్సులను పొందుకొని వెళ్ళారు. వారు ఆ కార్యక్రమములో ఉపన్యసించిన కొన్ని సందేశములను యిప్పుడు మనము యిక్కడ చూద్దాము.

మొదటిగా ఈ కార్యక్రమమునకు అధ్యకక్షులుగా తెనాలి నుండి గాన కళాప్రపూర్ణ సుందర సామ్రాట్‌ ప్రవచక బ్రహ్మ అయిన శ్రీ నోరినారాయణమూర్తి, ఎం.ఎ. పి.హెచ్‌.డి. గారు మరియు ముఖ్య అతిధులుగా విశాఖపట్నం నుండి శ్రీ కె. నరసింహనాయుడు, అధికార భాషా సంఘం అధ్యకక్షులు వచ్చియున్నారు. శ్రీ పణుగు శేషగిరి రావు, కాంగ్రెస్‌ లీడర్‌, విజయవాడ, శ్రీ కాజా రామకృష్ణ రావు, భగవద్గీత వర్షిణి, విజయవాడ నుండియు, విశాఖజిల్లాకు చెందిన శ్రీ జి. సూర్యనారాయణ, హెచ్‌.ఎం., జెడ్‌. పి. హైస్కూల్‌, ముసిరివాడ, శ్రీ జి. అప్పారావు, ఎల్‌.ఐ.సి. అడ్వయిజర్‌, సబ్బవరం, కావలి నుండి శ్రీ లక్ష్మణరావు, యోగా టీచర్‌ గారు, నరసారావు పేట నుండి శ్రీ ఈదర అమర్‌నాధ్‌గారు, విశాఖపట్నం నుండి శ్రీ ప్రకాశ్‌రావు గారు, మరియు విజయవాడ నుండి శ్రీ కాజా రత్నకుమారి, సోషల్‌ వర్కర్‌, అలాగే శ్రీ జి. తిరుపతి రెడ్డి గారు వచ్చియున్నారు. ఇంకనూ శ్రీ మౌలాలీగారు నరసారావు పేట నుండి వచ్చియున్నారు.

ఈ కార్యక్రమంలో మనుజ్యోతి ఆశ్రమ అధ్యకక్షులు శ్రీ పాల్‌ ఉపాజ్‌గారు వచ్చిన అతిధులకందరికీ వందనములు తెలియజేస్తూ … ”ఓం నమో భగవతే శ్రీలహరికృష్ణాయ నమః. ప్రియమైన సహోదరా, సహోదరీలారా! మనము 45వ కల్కిజయంతి ఉత్సవములు జరుపుకుంటున్నాము. ఈ రోజున ”సర్వ మత సమావేశము” అను కార్యక్రమము యిప్పుడు జరుగుచున్నది. ముఖ్యంగా ఈ కూటములు ‘ఒకే దేవుడు! ఒకే దేశము!’ అనే సిద్దాంతముపై జరుగుచున్నవి. భగవంతుడు మనుష్యుని సృష్టించినప్పుడు వారికి జాతి మతము అను ఎటువంటి బేధములు పెట్టలేదు. అందరూ స్వాతంత్య్రమును కలిగినవారిగా ఈ భూమిపై సృష్టించబడ్డారు. ఆయనను అంగీకరించి ఆయన పిల్లలుగా మనమందరము వుండాలి అనుటకే ఈ లోకము సృష్టించబడినది. మనుష్యుడే జాతి, మతములు అనునవి ఏర్పరిచాడు. అందుకే శ్రీమన్నారాయణుడే ఈ భూమిపైకి దిగిరావలసి వచ్చింది. అందుకే శ్రీలహరికృష్ణగారు మనకు ”ఒకే దేవుడు! ఒకే దేశము!” అను సిద్దాంతమును తీసుకొని వచ్చారు. చాలా మంది ఈ సిద్దాంతమును బయటకు మాత్రమే చెప్పుతూ వుంటారు గాని దానిని ఎవరూ అవలంబించుట లేదు. ఇటువంటి కార్యక్రమములు జరుపుట ద్వారా దైవీక ఆలోచనలను మన మనస్సులో కలిగియుండగలము. ఈ మనుజ్యోతి ఆశ్రమములో మనము బైబిలు, భగవద్గీత, ఖురాన్‌ మొదలగు వేదములనన్నిటిని చదువుచున్నాము. కావున మనలో నుండి జాతి, మతము అను వ్యత్యాసములను తీసివేయలేనట్లయితే మనము ముందుకు సాగలేము. అయ్యగారు మనకు ఏమని చెప్పారు? శ్రీమన్నారాయణుని ప్రేమ పతాకము క్రిందుగానే మనమందరము ఐక్యపడవలెనని చెప్పియున్నారు. భారతదేశము మాత్రమే అహింసను పాటించే దేశముగా వున్నది. ఈ సర్వమత సమావేశమును భగవంతుడు మాత్రమే జనుల మధ్యలోనికి తీసుకొని వెళ్ళగలడు గాని ఎటువంటి రాజకీయ నాయకులుగాని, సినిమా కళాకారులుగాని తీసుకురాలేరు.

ఈ మనుజ్యోతి ఆశ్రమము మాత్రమే ఇటువంటి సమైక్యతను చాటించుచున్నది. హిందూ మతముగాని, క్రైస్తవ మతముగాని, ముస్లీం మతముగాని ఎటువంటి జాతి గురించి గాని, మతము గురించి గాని చెప్పుటలేదు. ఈ సమయములో భారతదేశమును ఒక బానిస దేశముగా చేయవలెనని తలంచుచున్నారు. చుట్టూ శత్రువులు పొంచియున్నారు. ఇటువంటి సమయములో శ్రీమన్నారాయణుడే భారతదేశమును కాపాడగలడు మరియు దీనిని ఒక ఉన్నత దేశముగ మార్చగలడు. కావున దిగివచ్చిన శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణ నామములో మీ కందరికి నా శుభాకాంక్షలు తెలియజేసుకొంటున్నాను. ఇక్కడకు విచ్చేసిన అధ్యకక్షులకు, ముఖ్య అతిధులకు, వక్తలకు అందరికీ మనుజ్యోతి ఆశ్రమము తరుపున నా ఆహ్వానమును తెలియజేస్తున్నాను. ఓం నమో భగవతే శ్రీలహరికృష్ణాయ నమః!” అని ముగించారు.

మొదటిగా కార్యక్రమ అధ్యకక్షులు శ్రీ నోరి నారాయణ మూర్తిగారు మాట్లాడుతూ… ”ప్రపంచంలో అనేక మతములతో కొట్లాడుతున్న ఈ సమయములో, నాకు నేనే గొప్పవాడిని అని అహంకారముతో మసులుచున్న మనుష్యుల మధ్యలో, ధర్మాన్ని తిరిగి నిలబెట్టడానికి, మంచివారినందరినీ రక్షించడానికి, అధర్మమును సమూలంగానాశనము చేయడాకిని, అఖండ తోజో సంపన్నమైన ఆత్మీయతను మానవుల మధ్యలో తిరిగి తీసుకొనివచ్చుటకు ఈ కల్కిజయంతి ఉత్సవములు జరుగుచున్నాయి. ఇందుకొరకే శ్రీమన్నారాయణుడు శ్రీలహరికృష్ణగా దివి నుండి భువికి దిగివచ్చి అవతరించియున్నారు. కర్త, కర్మ, క్రియ అన్నీ శ్రీలహరికృష్ణగారే. ఆయన నోటితో మొదటిగా మాట్లాడిన పునీత పదం ”ధర్మం”. ఇది పరమాత్మకు యిష్టమైనది. దీనిని ఎవరైతే ఆచరిస్తున్నారో వారే భగవంతునికి యిష్టమైనవారు. అధర్మమును ఎవరైతే ఆచరిస్తున్నారో వారే నాశనమును కొనితెచ్చుకొనేవారు. ఈ లోకమంతా ధర్మబద్దంగా వుండితీరాలి. ”నేనున్నాను. మీకు నేనుండగా భయమెందుకు?” అన్నట్లుగా శ్రీలహరికృష్ణగారు తోడుగా మనకు వున్నారు. ఏ దేశము వాడైనా, ఏ వర్ణమునకు చెందినవాడైనా వారి కర్మల నుండి విడుదల పొందుకొనవలెనంటే వారంతా శ్రీలహరికృష్ణగారి సన్నిధిలోనికి రావలసిందే. ఏ స్థలములో కూడా ఈ విధముగా ఇంత జనము కూర్చొని వుండరు. కాని ఈ పుణ్యస్థలములో ఇంతమంది ఈ విధముగా వున్నారంటే దానికి కారణం ఆయన యొక్క మహిమయే. అనేక వేదములు, శాస్త్రములు, పురాణములు అన్నీ చదివి ”ఇవన్నీ ఒక్కటే. అన్నియు ఒకే భగవంతుని గురించి మాత్రమే చెప్పుచున్నవి” అని ప్రపంచం అంతటిలో చెప్పుచున్న వ్యక్తి ఎవరంటే అది శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారు ఒక్కరే!” అని చెప్పారు.

తరువాత శ్రీ కాజా రామకృష్ణగారు, భగవద్గీత వర్షిణి, విజయవాడ నుండి వచ్చినవారు మాట్లాడుతూ, ”సభాయ నమః లహరికృష్ణాయ నమః అగజానన పద్మార్కం గజానన మహర్నిశం. అనేకదంతం భక్తానాం. ఏకదంతం ఉపాశ్మహే! మన పురాణాలలో చెప్పబడినట్లుగా తపస్సును ఎక్కడ చేయాలి? అరణ్యములో చేయాలి. ఎందుకంటే జనారణ్యములో కూర్చొని మనము తపస్సును చేయలేము. బదిరికా వనములో 365 రోజులూ అక్కడ వసంతమే వుంటుంది. అక్కడ ఎల్లప్పుడూ సెలయేళ్ళు ప్రవహిస్తూనే వుంటాయి. అక్కడ చెట్లు, పకక్షులు అన్నీ ప్రశాంతంగా వుంటాయి. అటువంటి స్థలములో సమస్తమును వదిలి తపస్సు చేసిన అనేక మహర్షులు వున్నారు. అటువంటి వనములో సంచరించే ముఖ్యమైన పక్షి నెమలి. మొదటి సూర్యకాంతికి లేచి ఆడుకొనేది నెమలి మాత్రమే. ఆవిధముగా నెమలి తన అందముతో వయ్యారంగా తన అడుగులను వేస్తూ, ఆహారం తీసుకొంటూ వుంటుంది. పురివిప్పి ఆకాశము వైపు చూస్తూ నాట్యం చేస్తూ వుంటుంది. అది తన కృతజ్ఞతలను భగవంతునికి ప్రతీరోజూ తెలియజేస్తుంది. మరి మనుష్యులమైన మనము ఎంతమంది ప్రతీరోజూ భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము?

ముఖ్యమైన విషయము ఏమిటంటే, నెమళ్లు వున్నచోట మనుష్యులు వుండరు. మనుష్యులు వున్నచోట నెమళ్లు వుండవు. కారణం వాటికి భంగం కలుగుతుంది. కాని ఈ మనుజ్యోతి ఆశ్రమములో మాత్రం మనుష్యుల మధ్యలో నెమళ్లు మనుగడ సాగిస్తున్నాయి కనుక ఇదే కలియుగ బదరీ వనము. పకక్షులు, మనుష్యులు వుండే ఈ వనములో తపస్సు చేసుకొనే మహా పుణ్యమును మనకు అనుగ్రహించారు శ్రీలహరికృష్ణగారు. అందుకు ఆయనకు ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. మానవత్వము అనగానే కృతజ్ఞత. ఏనాడైన కోరిక కోరకుండా మానవుడు భగవంతునికి నమస్కరించామా? కాని ఈ వనములో మన కోరికలు అన్నీ విడిచిపెట్టి ఆయన స్మరణ చేయుట తప్ప మరేమియూ లేదు. ”ఎవడు అంత్యకాలమున నన్నే స్మరించుచూ శరీరమును వీడుచున్నాడో వాడు నన్నే చేరుకొనును” అని శ్రీకృష్ణుడు చెప్పియున్నాడు. జన్మ నుండి మరణము వరకు అందరూ అనేక పీఠముడులను వేసుకొనియున్నారు. ఎవరైనా శరీరమును విడిచిపెట్టినా, బంధములను విడిచిపెట్టడము చాలా కష్టము. తరువాతి మంచి జన్మ ఎత్తుటకు మనము తోటి వారికి సేవ చేయాలి. పూజ అనేది ఒకరికి మాత్రమే పరిమితమైనది కాని సేవ అనేది అందరికీ అపరిమితము. సేవ అనగా అవతలి వ్యక్తి నుండి ఏమీ ఎదురుచూడకూడదు. ఆ విధముగా నెమళ్ళు వున్న ఈ స్థలములో మనుష్యులుగా మనము ఆనందంగా నారాయణుని నామ స్మరణను చేసుకొంటున్నాము. సమస్తములోను బ్రహ్మ వున్నాడు. ప్రతీ అణువు, ప్రతీ ప్రాణి, ప్రతీ జీవి అన్నింటిలోను బ్రహ్మ మాత్రమే వున్నాడు. కనుక ఆ భగవంతుని మాత్రమే మనము తలంచుకొంటూ మరలా జన్మ ఎత్తకుండా ఇప్పుడే మంచి జన్మను జీవించాలని ఆశించుతూ నేను ముగిస్తున్నాను. కృష్ణం వందే జగద్గురుం!”

తరువాత విశాఖజిల్లా నుండి వచ్చిన శ్రీ జి. సూర్యనారాయణగారు మాట్లాడుతూ … ”ఓం నమో భగవతే లహరికృష్ణాయ నమః” అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీలహరికృష్ణగారికి నా నమస్కారములు. అలాగే వేదిక నలంకరించిన పెద్దలకు, వక్తలకు అందరికీ నా వందనములు తెలియజేసుకొంటున్నాను. 2005వ సంవత్సరములో ఆ మహానుభావుని జీవిత చరిత్రను బుర్రకధగా వ్రాసే గొప్ప వరమును శ్రీలహరికృష్ణగారు నాకు అనుగ్రహించారు. ఆయనే నాతో వ్రాయించుకున్నారు. దానికి నేను ఎంతో అదృష్టవంతుడ్ని.  ఇక్కడున్నవారికందరికీ వేదముల గురించి చెప్పనవసరం లేదు. అందరూ పరమాత్మ బిడ్డలే. ప్రయత్నమే నాది గానీ, ప్రయాణము నాది కాదు. అంతా స్వామిగారి ఆశీస్సులే. ”పలికేది భాగవతమైనా పలికించేది రాముడు మాత్రమే.” ఈ నాడు లోకమంతా మత ద్వేషాలతో, జాతి బేధాలతో పోట్లాడుకుంటున్న ఈ సమయములో శ్రీమన్నారాయణుడు తన సత్యమును ఈ లోకమునకు తెలియజేయుటకు ”ఒకే దేశము! ఒకే భగవంతుడు!” అని తన సిద్దాంతమును చాటారు. ఈ మిషిన్‌ ద్వారానే ప్రపంచమంతా కూడా మెలగాలి. ఇదే నీతి స్థాపన, రాజ్య స్థాపన. అతి త్వరలో లోకమంతా ఈ సిద్దాంతం క్రిందుగానే వస్తుందని తలస్తూ ఇంతటితో ముగించుకొంటున్నాను.

తరువాత శ్రీ నరసింహనాయుడుగారు మాట్లాడుతూ … ”గత సంవత్సరం నేను మొట్టమొదటిసారిగా ఈ స్థలమునకు వచ్చాను. మరువలేని మరువరాని మరువకూడని మనో జ్ఞాపకాలతో తిరిగి నా భార్యతో వస్తాను అని చెప్పాను. అలాగే వచ్చాను. అందరికీ నా యొక్క 45వ కల్కిజయంతి ఉత్సవముల శుభాకాంక్షలు. పాలు నీళ్ళకు తన రంగును, రుచిని, వాసనను అంతటినీ యిచ్చేస్తుంది. పాలలో నీళ్ళు మాత్రమే కలుస్తాయి గాని వేరే ఏ ద్రవమైనను కలువదు. కాని ఆ నీళ్ళు ఎక్కడ వున్నవో తెలియదు. పాలకు తన యొక్క విలువనంతటినీ ఆ నీళ్ళకు యిచ్చేస్తుంది. ఆ విధముగా నీళ్ళు కలిపిన పాలను పొయ్యిపై పెట్టినప్పుడు, ఆ వేడికి తట్టుకోలేక నీళ్ళు పైకి పొంగి పోతాయి. అప్పుడు పాలు, ‘మిత్రమా నీవు ఈపాటిదానికే నన్ను వదిలివెళ్ళిపోతే, నేను మళ్ళీ తిరిగి నిన్ను కలిసేవరకు అగ్ని ప్రవేశం చేస్తూనే వుంటాను’ అని పాలు చెప్పగానే, తిరిగి నీళ్ళు చల్లినవెంటనే ఆ పాల పొంగు తన స్నేహితుని తిరిగి పొందాను అని చల్లారుతుంది. మన స్నేహం కూడా లహరికృష్ణగారు చెప్పినట్లు ఈ విధముగానే వుంటుంది. మనకు కష్టాలు, సమస్యలు వున్నా, మీరు తిరిగి నా వద్దకు రండి అని లహరికృష్ణగారు మనలను పిలుస్తూనే వున్నారు. నిన్న జరిగిన నా యొక్క చిన్న సంభవమును చెప్తాను. నేను తిరునల్వేలిలో హౌరా కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్‌ రైలు దిగాను. నేను నా బంధువులు, అందరమూ కలిసి అందరూ జీపులో ఆశ్రమమునకు వస్తున్నాము. మా లగేజీ అంతా బండి మీదన వేసి కట్టుకొని వస్తున్నాము. పెద్ద గాలి వీస్తుంది. లహరికృష్ణగారి గురించి మాట్లాడుకుంటూ వున్నాము. ఆ సమయములో ఒక మారుతీ వేన్‌ మమ్ములను దాటుకొని వెళ్ళి మా ముందు ఆగింది. అందులోనివాళ్ళు ”ఒక పెద్ద బ్యాగ్‌ పడిపోయింది. అది మీదేనా అని చూచుకొండి” అని చెప్పారు. మాకు భయమేమి వేయలేదు. చాలా ప్రశాంతంగా వున్నాము. తిరిగి మా జీపును వెనక్కి తిప్పాము. ఇద్దరు కుర్రవాళ్ళు ఒక మోటారుసైకిల్‌పై ఆ బ్యాగ్‌ను తీసుకువస్తూ, మమ్ములను చూచి ఆగారు. మా ఆందోళనను చూచి ”ఇది మీదేనా అని చూచుకొండి” అని మాకు అప్పగించారు.  తీరా చూస్తే అది నా భార్య బేగ్‌. దీనిబట్టి నాకు అర్ధమయ్యింది ఏమిటంటే, ఆ నారాయణుడే ఒక ట్రాఫిక్‌ పోలీస్‌గా వుండి, ఇంత సుధీర్ఘ ప్రయాణంలో మాకు తోడుగా వుండి క్షేమంగా మమ్ములను తీసుకువచ్చారు. గంగలో మునిగితే తన పాపము పోతుంది. తాపముతో వుంటే పండు వెన్నెలలో కూర్చుంటే పోతుంది. ”పాపమును, తాపమును, దైన్యమును దొడ్డమొనరించు సజ్జనున్‌ దర్శించు.” అటువంటి సజ్జనుడు అయిన లహరికృష్ణను దర్శించినట్లయితే మన పాపము, తాపము అన్నీ పోతాయి.

ఏదో ఒక కోర్కెతోనే మనము దేవాలయమునకు వెళ్తాము గాని భక్తితో మాత్రము ఎప్పుడూ వెళ్ళలేదు. 11వ శతాబ్దంకు చెందిన ఉమర్‌కయాం అంటున్నారు. ”ఇంతకు ముందు దేవాలయ ప్రాంగణంలో చెప్పులు తీసుకొనిపోయాను. అవి అరిగిపోయినందువలన తిరిగి మార్చుకొనుటకు మాత్రమే నేను దేవాలయమునకు వచ్చాను గాని భగవంతుని కొరకు రాలేదు” అని ఆ కవి అంటున్నాడు. ఈ స్థలంలో ఎటువంటి ధ్యాస లేదు. మా రూం గురించి గాని, మా సూట్‌కేసు గురించి గాని మాకు ఎటువంటి ధ్యాస లేదు. ఒక్క లహరికృష్ణగారి ధ్యాస తప్ప. అన్నీ ఆయనే చూసుకొంటాడు. ఆయనే ప్రహరీగా మన మనస్సులను కాపలా కాయుచున్నారు. ఆయన ఇంద్రియములను జయించమని చెప్పారు. తుమ్మల శ్రీ వెంకట సీతారామశాస్త్రి చౌదరిగారు వ్రాసిన పద్యం జ్ఞాపకం వచ్చింది. ఈ కోవెలలో విగ్రహములు తప్ప దేవుడు లేడు. ”కోవెలలో, గంగానది రేవులలో, రామకోటి రేఖలలో లేడు. ఎవ్వాని ఎడ యెద కరుణకు ఆవాశము హరి నివసించున్‌.” ఈనాడు భగవంతుడు కోవెలలో గాని, గంగ, కృష్ణ వంటి పుణ్య నదులలో గాని, రామ రామ అని కోటిసార్లు వ్రాసిన పుస్తకములలో గాని లేడు. ఎవని హృదయంలో జాలి కరుణ దయ వున్నవో అటువంటి హృదయంలోనే భగవంతుడు నివసించుచున్నాడు అని ఆ కవి చెప్పియున్నాడు. మధర్‌ థెరిస్సా కూడా ”నేను ప్రపంచమును కారుణ్యంతోనే జయిస్తాను” అని సందేశమును చెప్పింది. మనుష్యునికున్న గొప్ప దుర్గుణం ఏమిటంటే, మన ప్రక్కనున్న వాని తప్ప ప్రపంచాన్నంతటినీ ప్రేమిస్తాము. అలాగే మహాత్మగాంధి కూడా ”నాకు పరిపూర్ణమైన నమ్మకముంది. మానవులందరూ ఒక్కటే. దేవుడూ ఒక్కడే! మనకు చాలా శరీరములు వున్నవి. ఆత్మ మాత్రం ఒక్కడే! సూర్యకిరణములు అనేకం. కాని సూర్యుడు ఒక్కడే!” అని అన్నారు. అలాగే ”ఒకే దేవుడు! ఒకే దేశము!”. ”భగవంతుని కన్నుల నుండి జారిన శాంతి ఏమైనా వుంటే అది ప్రేమయే” అని రవీంధ్రనాధ్‌ ఠాగూర్‌ అన్నారు. ప్రేమించే మనస్సుకు ప్రపంచమంతా సుఖమయం, ప్రేమించలేకపోతే అంతా నరకమే. మానవజీవితం ఒక పుష్పం, అందులో మధురం ప్రేమయే” ఈ విధముగా చెప్పి ఆయన తన ప్రసంగంను ముగించారు.

ఇంకా వచ్చిన వక్తలు, ప్రసంగీకులు, కవులు వారి వారి సిద్దాంతములను చెప్తూ, భగవంతుని జ్ఞానము యొక్క ఉపన్యాసములతో ”సర్వమత సమావేశము – దేశీయ సమైక్యతా సమావేశము” ముగిసింది. ఇదే కార్యక్రమము తమిళ్‌లో కూడా జరిగింది. ఆరోజున ”శ్రీలహరికృష్ణ అమృతగానం” అను తమిళ్‌పాటల ఆడియో సి.డి. కూడా విడుదల చేయబడినది. కావలసిన వారు మా చిరునామాను సంప్రదించగలరు.

– సహాయ సంపాదకులు

Filed under: మనుజ్యోతి ఆశ్రమము