1. Home
  2. »
  3. ఇతరములు
  4. »
  5. సృష్టి యొక్క సరిహద్దులు
సృష్టి యొక్క సరిహద్దులు

భగవంతుడు మనకు వర్షం అనుగ్రహించినప్పుడు ఉరుములతోను, మెరుపులతోను అనుగ్రహించియున్నాడు. ఆ వర్షపు నీరు అనేది సముద్రం, నది, కాలువలోను కాకుండా, మురికి గుంటలో పడి కలుషితం అయినను, ఆ సూర్యుడు తన వేడి చేత ఆ నీటిని తిరిగి ఆవిరి రూపములో తీసుకొనుచున్నాడు. ఇది ప్రకృతి యొక్క ప్రక్రియ. ఇదేవిధముగా భగవంతుడు మనుష్యులను పంచేంద్రియ ముల స్వభావము వల్ల భూమికి పంపించి తిరిగి వైంకుంఠమునకు తీసుకొనుచున్నాడు.

ఉదాహరణకు చూచినట్లయితే, భగవంతుడు మనకు వర్షం ఉరుములతోను, మెరుపులతోను అనుగ్రహించి యున్నాడు. ఈ ఉరుములు, మెరుపులు అనేది ఆయన యొక్క కోపముగా వున్నది. ఆ వర్షపు నీరు భూమి మీద పడటం అనేది మనుష్యుని యొక్క పంచేంద్రియముల స్వభావము వలన భూమికి పంపివేయుటగా వున్నది. ఆ వర్షపు నీరు అనేది మురికి గుంటలో పడి కలుషితం అవుతుంది. ఈ మురికి కలుషితం అనేది మనుష్యుని యొక్క పంచేంద్రియ స్వభావముగా వున్నది. ఆ కలుషితం అయిన మురికి నీటి నుండి సూర్యుడు తన వేడి చేత (వేడి అనేది భగవంతుడు మనలను పరీక్ష చేయుటగా వున్నది) మురికిని భూమి మీద విడిచిపెట్టి, ఆవిరి రూపములో ఆ నీటిని ఏవిధముగా తీసుకుంటున్నాడో అదేవిధముగా మన యొక్క విశ్వసించి చూచే స్థితిలో కంటికి కనిపించలేని స్థితిలో మనలను తన వైకుంఠమునకు తిరిగి తీసుకొనుచున్నాడు.

అదేవిధముగా చూచినట్లయితే మన యొక్క పంచేంద్రియముల స్వభావము అనగానేమి? మన యొక్క ఆలోచనయే పంచేంద్రియముల స్వభావముగా వున్నది. మనుష్యుడు ఎప్పుడు తన స్వంత ఆలోచనతోనే వెళ్ళాలని అనుకుంటున్నాడు. కాని ప్రతీ సృష్టి భగవంతుని యొక్క ఆలోచన ప్రకారముగా ఆయన యొక్క ఆజ్ఞ ప్రకారముగా నడుచుచున్నది. ఇదే ధర్మముగా యున్నది. అది ఏవిధముగా చూపించవచ్చును అంటే, ఉదాహరణకు అడవిలో మృగములను చూచినట్లయితే, తమ అడివి సరిహద్దుల నుంచి అవి మనుష్యులు నివసించు స్థలమునకు రావు. ఎందుకంటే భగవంతుడు మృగములకు ఆజ్ఞ యిచ్చుచున్నాడు. ఆ ఆజ్ఞ మూలముగా అవి మనుష్యులు నివసించు స్థలమునకు రావు. అవి గాని భగవంతుని ఆజ్ఞ మీరినట్లయితే మనుష్యులు నివసించు స్థలమునకు వచ్చి, మనుష్యులను చంపివేయును.

అదేవిధముగా ఒక సముద్రం చూచినట్లయితే అలలు వచ్చినప్పుడు తన సరిహద్దు వరకు వచ్చి తన స్థానానికి మళ్ళీ తిరిగి వెళ్ళుచున్నవి. ఆవిధముగా కాకుండా సముద్రపు అలలు మనం నివసించు స్థలము వరకు వచ్చినట్లయితే మనము ఆ స్థలములో నివసించలేము. సముద్రము కూడా దేవుని యొక్క పరిధిలోనే వున్నది.

అదేవిధముగా ఒక పామును మనము కర్రపెట్టి కొట్టుచున్నాము. ఆ పాము తప్పించుకొనిపోయి ఒక వంద పాములను తీసుకొనివస్తే మన సంగతి ఏమిటి? కాని పాము ఆ విధముగా చేయడం లేదు. ఎందుకు? ఆ పాముకి భగవంతుడు ఒక ఆజ్ఞ యిచ్చుచున్నాడు. ఆ ఆజ్ఞ ప్రకారము అది లోబడి వుంటుంది.

భగవంతుడు ప్రతీ సృష్టికి ఆజ్ఞలను ఆలోచనను యిచ్చుచున్నాడు. ప్రతి సృష్టిని ఆయన యొక్క ఆజ్ఞ మూలముగా, ఆయన యొక్క ఆలోచన మూలముగా నడిపించుచున్నాడు. సృష్టి అంతా వాటి వాటి సరిహద్దుల్లోని వుంటున్నది. కాని మనుష్యుడు మాత్రం తన హద్దులో వుండలేకపోవుచున్నాడు. ఎందువలన అనగా మనుష్యుడు తన స్వంత ఆలోచన చొప్పున పంచేంద్రియముల స్వభావము మూలముగా నడుచుచున్నాడు. సృష్టి ఏవిధముగా భగవంతుని ఆజ్ఞ చొప్పున, ఆయన యొక్క ఆలోచన చొప్పున నడుచుచున్నదో అదేవిధముగా ఈ మురికి లాంటి పంచేంద్రియములను వదిలి మనుష్యుడు భగవంతుని శరణు వేడుకొన్నప్పుడు భగవంతుడు మనుష్యులను తిరిగి వైకుంఠమునకు తీసుకొని వెళ్ళుచున్నాడు.

– కూర్పు : సుందర సింగ్‌, రాజమండ్రి.

Scroll to Top