ప్రియమైన సహోదర సహోదరీలారా, శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణ నామములో మా శుభాకాంక్షలు.
గత శీర్షికలో మీకు తెలియజేసిన విధముగా శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి మహిమ సన్నిధిలో మహిమ ఉత్సవములు మనుజ్యోతి ఆశ్రమములో బ్రహ్మాండముగా జరిగినవి. ఆంధ్ర, తమిళ్‌నాడు, భారతదేశములోని పలు ప్రాంతముల నుండియు మరియు జర్మనీ, మలేషియా దేశముల నుండి అనేకమంది శ్రీలహరికృష్ణగారి భక్తులు వచ్చి ఈ కూటములలో కలుసుకొని వెళ్ళారు. అది వారికి చాలా ఆశీర్వాదకరముగా వుండినది. ఈ కూటముల తరువాత అస్సాం, సిక్కిం రాష్ట్రములను మరియు మలేషియా దేశమును సందర్శించి, ఈ కూటములలో కలుసుకోలేని శ్రీలహరికృష్ణగారి భక్తులను కలుసుకొని వచ్చితిమి. అది మాకు చాలా ఆశీర్వాదముగా వుండినది.
అదేవిధముగా మీకు ముందుగానే తెలియజేసిన విధముగా మే నెలలో విధ్యార్ధులకు నిర్వహించిన వేసవి శిక్షణా తరగతులు (సమ్మర్ క్యాంపు) మనుజ్యోతి ఆశ్రమము నందును మరియు విశాఖ జిల్లాలో వున్న ఏజెన్సీ ప్రాంతమైన అసరాడలోనూ శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి కృప వలన చాలా బాగుగా జరిగినవి. దానిలో అనేకమంది విధ్యార్ధినీ విధ్యార్ధులు కలుసుకొన్నారు. వారికి వేదముల నుండి అనేక వేదప్రవచనములను నేర్పించడమే కాకుండా శరీర వ్యాయామములు కూడా నేర్పించారు. ముఖ్యముగా సమిష్టి జీవితము, ఆధ్యాత్మిక ఆలోచన, భగవంతుని ఏవిధముగా పూజించుట మొదలగు కార్యములన్నీ వారికి నేర్పించబడినవి. మరియు ఈ కలియుగములో కలి ప్రభావము నుండి (నవీన నాగరికతనుండి) ఏవిధముగా కాపాడబడవలెనని పిల్లలకు నేర్పించబడినది. వారు నేర్చుకొనిన వాటిలో నుండి వారికి పరీక్షలు, ఆటల పోటీలు నిర్వహించబడినవి. ఉత్తీర్ణులయిన వారికి బహుమతులు కూడా యివ్వబడినవి. అంతే కాకుండా క్యాంపులో పాల్గొనిన ప్రతీ విద్యార్థికి సర్టిఫికేట్, బహుమతులు యివ్వబడినవి. ఈ సమ్మర్‌క్యాంప్‌లో పాల్గొనిన విధ్యార్థులకు మరియు ఉపాధ్యాయులందరికీ చాలా ఆశీర్వాదకరముగా వుండినది.
ప్రస్తుత పరిస్థితిలో భగవంతునితో పాటు మన దేశము గురించియు మరియు మన భవిష్యత్తు గురించియు కూడా ఎన్నడూ మరిచిపోకూడదు. దాని గురించి శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారు చెప్పిన సందేశము నుండి కొంతభాగమును చూద్దాము.
”ఈ రోజున మీరు ఉత్తర భారతీయుడని, దక్షిణ భారతీయుడని నేను యీ మాట చెప్పడము లేదు. గాని ఒక మానవునిగ, ఒక భారతీయునిగ మీతో ఈ మాట అంటున్నాను. మీరు భారతీయునిగ వుంటే, భవిష్యత్తు మీదే. ఇక వేరే ఏ దేశమునకు భవిష్యత్తు లేదు. భారతదేశమునకు మాత్రమే భవిష్యత్తు వున్నది. ఎంతోమంది భారతదేశమును తమ గుప్పిట్లో తీసుకుందామనుకొన్నారు. కాని భారతదేశమును తీసుకోలేకపోయారు. కారణం భారతీయ సంస్కృతి చాలా పురాతనమైనది. భారతీయులందరూ సాధారణ మనుష్యులు కారు. వారు ఆ ”అవతార పురుషునికై” వేచియున్నారు. ఒక వృక్షములో అడుగుభాగము లోపల చాలా గట్టిగ వుంటుంది. అదే విధముగానే భారతదేశములోని హిందువులు యీనాడు వుంటున్నారు. వారిని డబ్బుతో కొనలేము. మహ్మదీయులు వారిని మార్చలేరు. అహింసతో వారు జయిస్తారు. హిందువులు, అహింస, శాఖాహారము యివన్నీ ఒకదానితో ఒకటి కలిసి ముందడుగు వేస్తున్నాయి. కావున ఈ రోజున భగవంతుని ప్రేమించిన వారికే భవిష్యత్తు వున్నది.
ప్రతివాడు తన మతమును గురించే మాటలాడుచున్నాడు. కాని భగవంతుని గురించి ఎవరూ మాటలాడటము లేదు. దానికి కారణము వారు దేవుని చూడకుండుటయే! దేవునితో వారికి ఎటువంటి వ్యక్తిగతమైన అనుభవము వుండుట లేదు. దానిని యీ రోజున మీరు ముట్టుకొనగలిగితే, ఆ శక్తి యీ రోజున మిమ్ములను ముట్టుకుంటే, మీ హృదయము తెరిచి ఒక స్నేహితుని ‘లోనికి రమ్ము’ అని ఆహ్వానించు విధముగ మీ జీవితములోనికి ఆయనను ఆహ్వానించి ‘నా కర్మను తీసివేయుము’ అని వేడుకొనిన యెడల మీ కర్మ మిమ్ములను వదిలిపెట్టి పోతుందో లేదో చూడండి!
‘ఈ రోజున నీవు జీవించియుంటే నీ స్వరమును నేను వినాలి’ అని మీ ఇంట్లో మీరు దేవుని అడగండి. అప్పుడు మీరు దేవుని స్వరమును తప్పక వింటారు. దేవుడు తనను తాను మీకు ప్రత్యక్షపరచుకుంటాడు. మనుష్యుడు లోకమునంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనిన యెడల ఏమి ప్రయోజనము? ఆలోచించి చూడుడి. అందుకే మీ హృదయమును తెరిచి దేవునిశక్తిని పొందుకొనుడి. మనిషి పోగొట్టుకొనిన నిత్యజీవమును తిరిగి పొందుకోవాలి అనునదియే మనుజ్యోతి ఆశ్రమము యొక్క ముఖ్య వుద్దేశము. ఈ ఆశ్రమము నిత్యజీవమును కనుగొనుటకు ఒక పరిశోధనా కేంద్రముగ వున్నది.”
”నా గొఱ్ఱె నా స్వరము వినునని” పరమ పురుషుడు చెప్పుచున్నాడు. ఆయన స్వరము మీరు వినడములేదా? ఆ స్వరమును మీరు వినినయెడల, జ్ఞానమును మీరు ప్రేమించినయెడల ఈ పరమపురుషుడు వ్యక్తిగతముగ మిమ్ములను సమీపించును. మీ హృదయములను తెరువుడి. మీ హృదయములోనికి రమ్మనమని అతనిని వేడుకొనుడి. మీకర్మ మిమ్ములను వదలిపోవును. ఆయన శక్తివంతమైన హస్తము మిమ్ములను ముట్టిన వెంటనే గొప్పశాంతి సమాధానము మీకు వచ్చును. కల్కి అవతారపురుషుడే మనుష్యకుమారుడనియు పిలువబడుచున్నాడు. ఈ భూమిపై మీ కర్మలను క్షమించే అధికారము ఆయనకు మాత్రవే వున్నది. అతను తనతో శాంతిని కలిగియున్నాడు. (పాపనివారణశక్తి) దానివలననే మీ కర్మను తీసివేయకలుగుచున్నాడు. దాని వలన మత మార్పు అవసరము లేదు.
ఈ యుగాంతమునందు భగవంతునిపై విశ్వాసము చాలా ముఖ్యము. ఈ పిలుపు నిజమైనదా? కాదా? అని బయలుపరచమని మీ సృష్టికర్తను ప్రార్ధించుడి. మీ సమస్త యాగముల వలన మీరు పరమపురుషుని చూడలేరు గాని ఆయనపై నున్న ప్రేమవలన మాత్రమే చూడగలరు! లోకము ఆయనను అంగీకరించలేకపోయినది. అందుకే మీకొరకు ఆయన వ్యక్తిగతముగవచ్చుచున్నాడు. మీరు ఆయనను ఆహ్వానించి ఈ గొప్ప ఐక్యత క్రింద సేకరింపబడుదురా? లేదా? అని పరీక్షించుకొనుడి. ఈ లోకమంతటిలోని లెక్కించలేనన్ని విభజనలకు, సమస్యలకు ఇదే పరిష్కారము.”
పైన యివ్వబడిన శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి సందేశములను ఒకసారి మీరు ఆత్మలో ధ్యానించండి. ఇటువంటి అమూల్యమైన సందేశమును చదివి విని విడిచిపెట్టుట వలన మనకు ఎటువంటి ప్రయోజనము వుండదు. కాని ఒకసారి మన జీవితములో ఆ మాటలను అలవరచుకొనినట్లయితే, యిక మనము ఈ లోకముతో ఎన్నటికీ కలుసుకొనలేము. ప్రతీ ఒక్కరి జీవితములోనూ ఆధ్యాత్మిక చింతన తప్పనిసరిగా వుండాలి. ఈ కలియుగములో ఎంతో కొంతైనా భగవంతుని యందలి భక్తి, భయము లేనట్లయితే, రాబోయే కష్ట కాలము నుండి మనము తప్పించుకొనుట చాలా కష్టము. భగవంతుని గురించి, ఆయన యిచ్చిన వేదముల గురించి మనము తెలుసుకొని, వాటిని మన తరువాత వచ్చే సంతతి వారికి కూడా అందజేయుటకు ప్రయత్నము చేయాలి. అప్పుడే మనకు, మన సమాజానికి, మన దేశానికి కూడా ఎంతో ఆశీర్వాదము వుంటుంది. ఎందుకంటే భగవంతుని నామ స్మరణ లేనిదే ఏ దేశమైనా సుభిక్షముగా వుండలేదు. మనము భగవంతుని నుండి ఉచితముగా పొందే ప్రతీ కార్యమునకు తప్పనిసరిగా ఆయనకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లిస్తూ వుండాలి.
ధర్మమును స్థాపించు కర్తవ్యములో అందరికీ భాగముగ ఈ పత్రికను మీరు చదివి, మీ స్నేహితులు, బంధువులు కూడా తెలుసుకొనుటకు ప్రయత్నించ గలరని ఆశించుచున్నాము. సమస్త స్తుతి ఘనత మహిమ సృష్టికర్త అయిన శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణకే చెల్లించుచున్నాము.
– సంపాదకులు